ఈటెల తో అమిత్ షా కీలక చర్చలు

కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి దాదాపు 25 నిమిషాల పాటు చర్చలు జరిపారు. హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి చేరుకున్న అమిత్‌షా ఈటెల ను పరామర్శించారు. ఇటీవల ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి 25 నిమిషాలపాటు ఉన్నారు. సుమారు 15 నిమిషాలపాటు అమిత్ షా.. ఈటలతో ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు.. మునుగోడు, పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అమిత్‌షా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అంతకు ముందు అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోడీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు.