సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్న కేంద్రమంత్రి అమిత్ షా

బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో అమిత్ షా పర్యటించనున్నారు. సంగారెడ్డిలో ఈ నెల 12 న జరిగే మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 12న అమిత్ షా హైదరాబాద్​కు చేరుకుంటారు. హకీంపేట్​లో జరిగే సీఐఎస్ఎఫ్ ప్రోగ్రామ్​లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్ షా సమావేశమవనున్నారు.

ఆ తర్వాత అదే రోజు సాయంత్రం కర్నాటకలోని బీదర్​కు చేరుకుంటారు. అమిత్ షా తెలంగాణ టూర్​కు సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమై చర్చించారు. సంగారెడ్డి లో జరిగే మేధావుల సమావేశం కోసం ఏకంగా రెండు వేల మంది వచ్చేలా బిజెపి ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఈ మేధావుల సభ హైదరాబాదులో జరగాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం లో సంగారెడ్డికి తరలించారు.