నిర్మల్ సభ లో కేసీఆర్ ఫై విరుచుకుపడిన అమిత్ షా

నిర్మల్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో కేసీఆర్ సర్కార్ ఫై బిజెపి నేతలు విరుచుకపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడిన తర్వాతే తెలంగాణకు నిజమైన విముక్తి అని అమిత్ షా అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అమిత్‌షా నిర్మల్‌ సభ వేదికగా సమరశంఖం పూరించారు. ఎంఐఎం నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మీ ఆగడాలు సాగవ్ అంటూ తేల్చేశారు. మజ్లిస్‌ను ఓడిస్తేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ అన్నారు షా. ఇక్కడ నినదిస్తే… రిసౌండ్ హైదరాబాద్‌లో రావాలన్నారు. మజ్లిస్‌తో పోరాటం ఒక్క బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

ఇటీవల బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు అమిత్ షా. వెనక రెండో వరుసలో కూర్చున్న ఈటలను ముందుకు రావాలని పిలిచారు. ఈటలకు గట్టిగా అభివాదం చేయాలంటూ ప్రజలను కోరారు. హుజూరాబాద్‌లో డబ్బులతో గెలవాలని అధికార పార్టీ చూస్తోందని.. ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలో ఆలోచించాలని అమిత్ షా సూచించారు. డబ్బు అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా బీజేపీ నేతలు అభివర్ణించారు. ఈటల ప్రస్తావనతో సభ చప్పట్లతో మార్మోగిపోయింది.