మోడీ@20 పుస్కకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు..మోడీ ని కొనియాడిన అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ@20 ఏళ్ల పాలనపై రాసిన పుస్తకం ‘మోడీ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కలలు సాకారం కాగలవని మోడీ ప్రపంచానికి చాటి చెప్పినట్టు పేర్కొన్నారు. నరేంద్ర మోదీలోని విభిన్న ఆలోచనా ప్రక్రియ, విభిన్న కోణాలు, మార్గదర్శకత్వం, చురుకైన విధానం, సర్వోత్కృష్టమైన, పరివర్తన నాయకత్వ శైలికి గుర్తింపు లభించినట్టు చెప్పారు.

హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ’’ప్రధానిని సమర్థుడైన నేతగా కొనియాడారు. భూకంపంతో కుదేలైన గుజరాత్ రాష్ట్రానికి మోడీ సీఎం అయ్యే సమయానికి పంచాయతీని నడిపించిన అనుభవం కూడా లేదు. అయినా కానీ, సమర్థవంతంగా పాలించడం ద్వారా తదుపరి ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధించారు’’అని తెలిపారు.

జైశంకర్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై చర్చకు ప్రధాని నాయకత్వం వహించినట్టు చెప్పారు. ‘‘అభివృద్ధి ఆధారిత దౌత్యాన్ని అనుసరించారు. భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. ఎగుమతులను 400 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లారు’’అని జైశంకర్ వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/