షెట్టర్ రాజీనామా బాధించిందిః కర్ణాటక ముఖ్యమంత్రి

బిజెపిలోనే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డ బొమ్మై

Basavaraja Bommai

బెంగళూరుః బిజెపి సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ రాజీనామాపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. షెట్టర్ నిర్ణయం తనను బాధించిందని, పార్టీలోనే కొనసాగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతగా ఆయన బిజెపికి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. ఆయన సేవలు పార్టీకి అవసరమనే ఉద్దేశంతో స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఓ పోస్టును షెట్టర్ కు ఆఫర్ చేశారని చెప్పారు. అయినా షెట్టర్ వినిపించుకోలేదని, పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారని బొమ్మై వివరించారు.

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జగదీశ్ షెట్టర్ బిజెపి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆదివారం తన పదవికి, బిజెపి సభ్యత్వానికీ రాజీనామా చేసిన షెట్టర్.. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో బిజెపి బలోపేతానికి తాను చేసిన కృషిని పార్టీ హైకమాండ్ విస్మరించిందని షెట్టర్ ఆరోపించారు. పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడంతో గత్యంతరం లేక పార్టీని వీడానని చెప్పారు. పార్టీ నిర్ణయంతో తన మనసు విరిగి పోయిందని, ఒకవేళ టికెట్ ఇస్తామని చెప్పినా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని జగదీశ్ షెట్టర్ తేల్చిచెప్పారు.