రైతుల పట్ల తనకున్న శద్ధను ప్రధాని చాటుకున్నారు : అమిత్‌షా

న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని అమిత్‌‌షా అన్నారు. మోడీ నిర్ణయం దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణాన్ని మరింత పెంచుతుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

అమిత్‌షా వరుస ట్వీట్లలో ప్రధాని చర్యను అభినందిస్తూ, మన రైతులకు సేవలందించేందుకు, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు భారత ప్రభుత్వ కట్టుబడి ఉందని ప్రధాని తన ప్రసంగంలో నిర్ద్వంద్వంగా చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రధాని తన నిర్ణయాన్ని ప్రత్యేక పర్వదినమైన ‘గురు పూరబ్’ను ఎంచుకున్నారని, దీనిని బట్టే దేశ ప్రజల ప్రతి ఒక్కరి సంక్షేమం తప్ప మరో ఆలోచన లేదనే విషయాన్ని ఆయన చాటుకున్నారని అమిత్‌షా ప్రశంసించారు. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని మోడీ ని ప్రశంసించారు. ఇదే విషయాన్ని నడ్డా కూడా తన ట్వీట్‌లో ప్రస్తావించారు. రైతుల పట్ల తనకున్న శద్ధను ప్రధాని చాటుకున్నారని అన్నారు. సుపరిపాలనా దిశగా మోడీ ఎన్నో చర్యలు తీసుకున్నారని, సమష్టి కృషి, సమష్టి స్ఫూర్తిగా దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు మనమంతా కంకణబద్ధులు అవుదామని నడ్డా అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/