మునుగోడు అమిత్ షా పర్యటన వివరాలు

ఈ నెల 21 న మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కు ముఖ్య అతిధి గా కేంద్రమంత్రి అమిత్ షా తో పాటు పలువురు బిజెపి అగ్ర నేతలు హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా పర్యటనకు సంబదించిన వివరాలను పార్టీ తెలిపింది.

మధ్యాహ్నం 3.40 గంలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.15గంలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.40 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. తిరిగి అమిత్ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో 6.25గంలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని 6.30 గంలకు ఢిల్లీకి పయనమవుతారు.

మరోపక్క మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఆరు నెలలలోపు ఎప్పుడైనా ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో అక్కడ వ్యాపారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మునుగోడులో మకాం వేయాల్సి రావడంతో లాడ్జీలు, రెస్టారెంట్లకు గిరాకీ పెరిగింది. నాయకులు బస చేయడం కోసం అద్దె ఇళ్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఉప ఎన్నికల నేపథ్యంలో వ్యాపారులు తమకు బిజినెస్ పెరిగిందన్న సంతోషంలో ఉన్నారు.

మునుగోడు, చండూరులో ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 25వేలు పలుకుతున్నట్లు సమాచారం. ఇక ఉన్న లాడ్జీలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇళ్లు, హోటళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉండే చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇళ్లు, లాడ్జీలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు రూ. 10వేలు పలికిన ఇళ్లు, షెట్టర్ అద్దెలు ఇప్పుడు రూ. 15వేలు దాటాయి. ఇక ఫంక్షన్ హాల్స్ మొత్తం బుక్ చేసుకుని అక్కడే రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడంతో వాటికీ డిమాండ్ పెరిగింది.