కేసీఆర్ కు బండి సంజయ్ ఒక్కడు చాలు – అమిత్ షా

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్బంగా తుక్కుగూడలో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని నిరంకుశపాలనను అంతమొందించడం కోసం జరిగిన యాత్ర అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు.

తెలంగాణ‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు పరాకాష్ఠకు చేరాయ‌ని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను సాధిస్తామ‌ని హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌…ఆ హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామ‌కాల హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ హామీని నిల‌బెట్టుకునే శ‌క్తి ఒక్క బీజేపీకి మాత్ర‌మే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. హైద‌రాబాద్ విముక్తి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని అమిత్ షా చెప్పారు. తెలంగాణ‌ను కేసీఆర్ మ‌రో బెంగాల్ లా మారుస్తార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

బండి సంజ‌య్ సాగించిన పాద‌యాత్ర అధికారం కోస‌మో, ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి అధికార బ‌దలాయింపు కోస‌మో కాద‌ని అమిత్ షా చెప్పారు. బ‌డుగు, బ‌ల‌హీన వర్గాల అభ్యున్న‌తి కోసమే బండి సంజ‌య్ పాద‌యాత్ర సాగింద‌న్నారు. కొడుకు, కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్ సర్పంచ్‌ల‌కు మాత్రం అధికారం ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ పాల‌న‌ను సాగ‌నంపేందుకు తెలంగాణ యువ‌త సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొన‌లేక‌పోతే త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి అస‌మ‌ర్థ సీఎంను త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని కూడా ఆయ‌న కీల‌క వ్యాఖ్య చేశారు.