ఈటల సస్పెన్షన్ విషయంలో పార్టీ నేతల ఫై అమిత్ షా ఫైర్

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..వేడుకల అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ తీరు ఫై , మునుగోడు ఉప ఎన్నిక గురించే కాకుండా ఈటల సస్పెన్షన్ ఫై మాట్లాడారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్షలో ఈటల రాజేందర్ సస్పెన్షన్‌ అంశంపై నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేస్తే పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈటలకు మద్దతుగా పార్టీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడేదని అభిప్రాయపడ్డారు.

అమిత్ వ్యాఖ్యలకు ఒకరిద్దరు సమాధానం చెప్పబోతుంటే.. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు?.. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేసి ఉండాల్సింది’ అని కాస్త గట్టిగానే అమిత్ షా వారితో అన్నట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్‌పైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జులు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో పాటు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్‌, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.