అమెరికాలో మళ్లీ కరోనా పంజా

ప్రతి రోజూ 2 వేలకుపైగా మరణాలు

న్యూయార్క్: అమెరికాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగుచూస్తుండగా, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నప్పటికీ తీవ్రంగా కొత్త కేసులు, మరణాలు చోటుచేసుకుంటుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల తీవ్రత కొంత తగ్గినప్పటికీ తాజాగా కేసులు మళ్లీ ఉద్ధృతమయ్యాయి. గత వారం రోజుల్లో అమెరికాలో ప్రతి రోజూ సగటున 2,012 మంది మృతి చెందారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 2,579 మంది మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాలో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. సెప్టెంబరు 13న అత్యధికంగా 2.85 లక్షల కేసులు నమోదు కాగా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

శుక్రవారం 1.65 లక్షల కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం ప్రతి రోజూ రెండువేలకు పైగా నమోదవుతుండడంతో ఆందోళన నెలకొంది. కాగా, అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 99 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమని అమెరికా సీడీసీ తెలిపింది. మరోవైపు, అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 54 శాతం మంది ప్రజలకు రెండు డోసులు వేయగా, 63 శాతం మందికి తొలిడోసు పూర్తయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/