కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మరో ఉగ్రదాడి జరగబోతుందట

అఫ్గానిస్థాన్​లోని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మూడు రోజుల భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో దాదాపు 180 మంది వరకు మరణించగా..వందల సంఖ్య లో గాయపడ్డారు. ఇప్పుడు మరో హెచ్చరిక జారీచేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడులు జరగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయని.. ఎయిర్‌పోర్టును పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తమ సైనికాధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ కాబూల్‌ నుంచి పౌరుల తరలింపు కొనసాగుతున్నదని బైడెన్‌ వెల్లడించారు. శనివారం మరో 6800 మందిని అక్కడి నుంచి తరలించామని, అందులో వేలసంఖ్యలో అమెరికన్లు కూడా ఉన్నారని చెప్పారు.

ఇదిలా ఉంటె కాబూల్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దారుణమైన పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కుల చూపిస్తున్నాయి. ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్లుగా(దాదాపు రూ. 3వేలు) ఉండటం సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. అయితే అమ్మకాలు.. డాలర్లలో సాగడంతో వాటర్ బాటిల్ కొని దాహం తీర్చుకోలేని స్థితిలో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో చాలా మంది జనాలు కష్టాలు అనుభవిస్తున్నారు.