అంబులెన్స్ బిల్లా లేక ఆసుపత్రి బిల్లా?

కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా జనాలు చితికిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితులను కొందరు మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. వారిలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక చోట మాత్రం ఓ అంబులెన్స్ బిల్లు చూసి నోరెళ్లబెట్టారట అక్కడి జనం. కేవలం అంబులెన్స్‌కే ఇంత బిల్లు అయితే ఆసుపత్రిలో ఎంతమేర దోచుకుంటున్నారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

ఓ కరోనా బాధితుడిని హరియాణాలోని గురుగ్రామ్‌ నుంచి పంజాబ్‌లోని లూదియానా వరకు అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు ఆ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ.1 లక్షా 40 వేలు అడిగాడట. అయితే రోగి దగ్గర ఆక్సీజన్ సిలిండర్ అందుబాటులో ఉండటంతో రూ.20 వేల డిస్కౌంట్ కూడా ఇచ్చాడట ఈ ఘనుడు. చేసేదేమీ లేక ఆ అంబులెన్స్ డ్రైవర్ చెప్పిన రేటుకే కరోనా రోగిని తరలించారు అతడి బంధువులు. అయితే 350 కిలోమీటర్ల దూరానికి ఇంతమొత్తంలో వసూలు చేసిన ఆ అంబులెన్స్ డ్రైవర్‌పై బాధితుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడట.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆ అంబులెన్స్ తాలుకా బిల్లును సోషల్ మీడియాలో పోస్టు చేశారట. ఇక ఈ అంబులెన్స్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కరోనా సమయంలో అంబులెన్సులే ఈ రకంగా దోచుకుంటే, ఆసుపత్రులు ఇంకా ఎలా దోచుకుంటున్నాయో అని నెటిజెన్లు మండి పడుతున్నారు.