ఈనెల 6న కేటీఆర్ చేతుల మీదుగా మహబూబ్​నగర్​లో ఐటీ టవర్ ప్రారంభోత్సవం

దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్‌ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర, దివిటిపల్లి వద్ద 2018 జులై 7న శంకుస్థాపన చేసిన ఐటీ, మల్టీపర్పస్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పన కోసం ఐదెకరాల్లో చేపట్టిన ఐటీ టవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన ఐటీ టవర్ ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ టవర్​ను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టీఎస్‌ఐఐసీ అధికారులతో సమీక్షా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌-బెంగళూరు హైవే-44 నుంచి దివిటిపల్లి శివారులోని ఐటీ టవర్‌ వరకు 100 ఫీట్ల రోడ్డును నిర్మించాలని ఆదేశించారు. టవర్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు కనెక్టింగ్‌ రహదారులుండాలని కలెక్టర్‌ రవిని ఆదేశించారు. ఐటీ టవర్‌ ఏర్పాటుతో నాలుగేండ్ల లో 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రవి, డీజేఎం శ్యాంసుందర్‌రెడ్డి, కన్సల్టెంట్‌ రాజ్‌కుమార్‌, నిర్మాణ సంస్థ గుత్తేదారులు రాజశేఖర్‌రెడ్డి, అమరరాజా ప్రతినిధి రవితేజ పాల్గొన్నారు.