రాయుడు దెబ్బకు హడలెత్తిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2021లో భాగంగా నేడు జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌లో తడబడింది. ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(4) తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు.

అయితే మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50) పరుగులతో అదరగొట్టగా, అతడికి తోడుగా మొయిన్ అలీ(58) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు108 పరుగుల భాగసౌమ్యాన్ని అందించారు. అయితే ఆ తరువాత కేవలం 4 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరు బ్యా్ట్స్‌మెన్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తరువాత వచ్చిన రైనా కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. కానీ మరో బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు మాత్రం ముంబై ఇండియన్స్ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.

కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రాయుడు, 27 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగులు చేసింది. రాయుడు మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ ముందు 219 పరుగుల లక్ష్యం ఉంది. మరి ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.