‘చంద్రబాబు గారి దత్తపుత్రుడు’ సినిమా చేస్తాం అంటూ పవన్ ఫై అంబటి సెటైర్లు

ambati rambabu slams pawan kalyan

వైసీపీ నేతలు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మాటల యుద్ధం చేస్తున్నారు. శనివారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయిల ఆర్ధిక సాయం అందజేసి..వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో పవన్ ఫై వరుసపెట్టి వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు గారి దత్తపుత్రుడు’ అనే టైటిల్‌తో మేం సినిమా తీస్తాం.. ఎక్కువ మంది హీరోయిన్‌లు అవసరం అవుతారని నిర్మాతలు ముందుకు రావడం లేదని ఎద్దేవా చేసారు.

ఆదివారం మీడియాతో రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే లక్ష్యమని చెప్పాడని దుయ్యబట్టారు. పవన్‌కు తనకంటూ సొంత ఆలోచన లేదుని మండిపడ్డారు. ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పాలనలో రైతులు అన్యాయానికి గురైతే పవన్ ఏనాడూ మాట్లాడలేదని, రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టినప్పుడు కూడా నోరెత్తలేదని మండిపడ్డారు. కానీ రైతుల కోసం జగన్ ఎంతో మేలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను గద్దె దించడం పవన్ కళ్యాణ్‌ వల్ల కాదు.. ఆయనకు ప్యాకేజీలు ఇస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును గద్దెను ఎక్కించటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని.. సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడికే ఉంటుందా? అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రీన్ ప్లే రాయటం వచ్చు అన్నారని.. మాకు సినిమా తీయటం కూడా వచ్చన్నారు. దత్తపుత్రుడు, చంద్రబాబు గారి దత్తపుత్రుడు… టైటిల్ బాగుందా? అని ఎద్దేవా చేశారు.