హరీష్ రావుకు అంబటి రాంబాబు కౌంటర్

తెలంగాణ మంత్రి హరీష్ రావు కు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘పోలవరం కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఐదేళ్లు అయినా పూర్తి కాదు. కొంతమంది ఇంజినీర్లను అడిగితే.. ఇంకా ఐదేళ్లు అయినా పూర్తి కాదని చెబుతున్నారు. కానీ.. మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశామో అందరూ చూశారు. ఇప్పుడు దాని ఫలాలు అందరికీ అందుతున్నాయి’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

‘ఆ ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పారో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కించపర్చడానికి పోల్చారో తెలియదు గానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు వేరు. పోలవరం ప్రాజెక్టు వేరు. కాళేశ్వరం కేవలం 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీ. అంత కంప్లీట్ లిఫ్ట్ ఇరిగేషన్. కానీ పోలవరం అలా కాదు. ఇది బహుళార్దకమైన ప్రాజెక్టు. 196 టీఎంసీ స్టోర్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీరు తరలిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకు.. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మరి ఇష్యూ ఇక్కడితో ఆగుతుందో లేక పెరుగుతుందో చూడాలి. గతంలో కూడా ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వైస్సార్సీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు.