అమెజాన్ సంచలన నిర్ణయం .. 25 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సైట్ ను మూసివేస్తున్నారు

దిగ్గజ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గ్లోబల్ ర్యాంకింగ్ వెబ్‌సైట్‌ సర్వీస్ నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. వెబ్‌సైట్‌ ర్యాంకింగ్ సిస్టం, అనాలిసిస్ టూల్ అలెక్సా.కామ్ (Alexa.com) ను వచ్చే ఏడాది మే 1వ తేదినుండి ఆపేస్తామని ప్రకటించింది. ఈ మేరకు యూజర్లకు కొన్ని సూచనలు చేసింది.

ఈ సర్వీస్‌ ద్వారా పలు వెబ్‌సైట్లకు ఎస్‌ఈవో (సెర్చ్‌ ఇంజన్‌ అప్టిమైజేషన్‌), అనాలిసిస్‌ టూల్స్‌ను అమెజాన్‌ అందిస్తోంది. వచ్చే ఏడాది నుంచి వెబ్‌సైట్‌ల స్టాటిస్టిక్స్‌, వాటి ర్యాంకింగ్‌లను అందించే సర్వీసులను అమెజాన్‌ నిలిపివేయనుంది. అలెక్సా ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన తర్వాత, API సర్వీసెస్‌ను 2022 డిసెంబర్ నుంచి పూర్తిగా మూసివేయనుందని తెలుస్తోంది. సర్వీస్ షట్ డౌన్ అయ్యేలోపు ఆయా వెబ్‌సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు అమెజాన్‌ వీలును కల్పించనుంది.

“డిజిటల్ ఆడియన్స్‌ను కనుగొనేందుకు, వారికి చేరువయ్యేందుకు రెండు దశాబ్దాలుగా మీకు సాయం చేసిన తర్వాత అలెక్సా.కామ్ ను నిలిపివేయాలన్న కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. 2022 మే 1వ తేదీన అలెక్సా.కామ్ రిటైరవబోతోంది” అని సపోర్ట్ పేజీలో అలెక్సా ఇంటర్నెట్ ప్రకటించింది. అలాగే డిసెంబర్ 8వ తేదీ నుంచి కొత్త సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వడం ఆపేసింది అలెక్సా ఇంటర్నెట్.