అమెజాన్ చీఫ్ ఫోన్ ను హ్యాక్ చేసిన సౌదీ రాజు?

నిజమేనని వ్యాఖ్యానించిన అమెజాన్

amazon-boss-jeff-bezoss-saudi-crown-prince
amazon-boss-jeff-bezoss-saudi-crown-prince

వాషింగ్టన్‌: అమెజాన్‌ చీఫ్ జెఫ్‌ బెజోస్‌ స్మార్ట్ ఫోన్‌ ను సౌదీ రాజు హ్యాక్‌ చేశారని ‘గార్డియన్‌’ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 2018లో జరిగిందని, ఆ సమయంలో సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నుంచి, జెఫ్ సెల్ ఫోన్ కు ఓ వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చిందని, దాన్ని రిసీవ్‌ చేసుకున్న అనంతరం జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని పత్రిక తెలియజేసింది. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సొంతంగా వాడుతున్న వాట్సాప్‌ ఖాతా నుంచి వైరస్‌ నిండిన ఓ వీడియో ఫైల్ జెఫ్ కు చేరిందని, దాన్ని తెరవగానే ఆయన ఫోన్ హ్యాక్ అయిందని డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణ స్పష్టం చేసిందని ఈ కథనంలో గార్డియన్‌ వెల్లడించింది. అయితే, హ్యాక్ అయిన తన ఫోన్ నుంచి జెఫ్‌ బెజోస్‌ ఎటువంటి విలువైన సమాచారాన్ని పోగొట్టుకున్నారన్న విషయం తమకు తెలియదని చెప్పింది. జెఫ్‌ బెజోస్‌, ఆయన భార్య తమ ఇరవై ఐదు సంవత్సరాల కాపురానికి వీడ్కోలు పలుకుతూ విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత ఈ విషయం బహిర్గతం కావడం గమనార్హం.

ఈ విషయాన్ని అమెజాన్ సెక్యూరిటీ వింగ్ కూడా అంగీకరించింది. టీవీ యాంకర్‌ లౌరెన్‌ సాంచెజ్‌ తో జెఫ్‌ వివాహేతర సంబంధం కొనసాగించిన వేళ, పంపిన మెసేజ్‌ లు హ్యాక్ అయ్యాయని, ఆయన తన ఎఫైర్‌ ను బహిర్గతం చేయకముందే సౌదీ ప్రభుత్వం ఫోన్‌ డేటాను సంగ్రహించిందని అంచనా వేస్తున్నామని అమెజాన్‌ చీఫ్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ గవిన్‌ బెకర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ తాజా విషయంపై అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం స్పందించింది. జెజోస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌లో సౌదీ హస్తం ఉందని మీడియాలో వస్తున్న కథనాలు అర్థంలేనివని వ్యాఖ్యానించింది. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/