అమర్‌నాథ్‌ యాత్రలో అనకాపల్లి వాసి మృతి..

, amarnath yatra

అమర్‌నాథ్‌ యాత్రలో అనకాపల్లికి చెందిన బోడాల సూరి అప్పారావు అనారోగ్యం తో మృతి చెందారు. జులై 2న 15 మందితో కలసి అమర్‌నాథ్‌ యాత్రకు బయలు దేరారు. బద్రినాథ్‌లో దర్శనం చేసుకుని అక్కడే రాత్రి బస చేశారు. అప్పరావుకు రాత్రి ఊపరాడక పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పారావు ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పారావు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇక గత వారం అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా అమర్‌నాథ్‌ గుహవద్ద భారీ వరదలు రావడంతో దాదాపు 16 మంది వరదల్లో చిక్కుకొని మృతి చెందారు. అలాగే 40 మంది వరకు గాయపడ్డారు. ఇక చనిపోయిన వారిలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు అనారోగ్యం తో అప్పారావు మృతి చెందడంతో ఏపీలో విషాదం నెలకొని ఉంది. అలాగే ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పరమేశ్వరుని దయతో విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డామని వారంతా చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు.

వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మంది కలిపి మొత్తం 35 మంది గత నెల 27న విజయవాడ నుంచి రైలులో అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటికే అప్పటివరకు వారు బస చేసిన ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.