కొత్త పార్టీపై కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ వివరణ

పార్టీ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదన్న అమరీందర్

చండీఘ‌ఢ్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్… తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో తమ లాయర్లు చర్చలు జరుపుతున్నారని… అందువల్ల పార్టీ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదని చెప్పారు. పార్టీ గుర్తును ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను ఎంతో కాలం పని చేశానని… ఇంకో పది రోజులు ఆ పార్టీలో ఉండటం వల్ల ఎలాంటి నష్టం లేదని అన్నారు. మరోవైపు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ కానున్నారు.

పంజాబ్ లో ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్ర హోంమంత్రి చెపుతున్నారని… ఆయనొక అసమర్థ హోంమంత్రి అని అమరీందర్ విమర్శించారు. తమ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని ప్రారంభించిన తర్వాత మొత్తం 117 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఈ సీట్లన్నింటిలో ఒంటరిగా పోటీ చేస్తామా? లేక పొత్తులో భాగంగా పంచుకుంటామా? అనే వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో సిద్ధూ చేరినప్పటి నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చిందని అన్నారు. సిద్ధూకి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఏదో పిచ్చి వాగుడు వాగుతుంటారని విమర్శించారు. సుపరిపాలన గురించి సిద్ధూకి తెలియదని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/