మహిళా దినోత్సవం.. రాజధానిలో ఆగిన నిరసనలు

అమరావతి: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు నేటితో 82వ రోజుకు చేరాయి. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని ప్రాంత గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించొద్దని, రాజధాని కోసం నిరసనలు తెలపాలని అమరావతి ప్రాంత మహిళలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మందడంలో వినూత్న పద్ధతిలో నిరసనలు తెలిపేందుకు మహిళలు సిద్ధమయ్యారు. మదర్ థెరిస్సా, రాణి రుద్రమదేశి, ఝాన్సీ లక్ష్మీభాయి, మలాల వేష ధారణలు ధరించి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా నల్ల బెలూన్లను ఎగురవేసి, రాట్నాలతో నూలు వడకాలని నిర్ణయించారు. మరోవైపు వెలగపూడిలో 22 మంది మహిళలు 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. 151 మంది మహిళలు 12 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/