14వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్ర 14 వ రోజుకు చేరింది. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావు, అఖిలపక్ష ఐక్య కార్యచరణ సమితి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పితే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఒకే ఒక రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు దేవుడే తగిన బుద్ధి చెబుతాడని యాత్రలో పాల్గొన్న మహిళలు అంటున్నారు. జగన్‌ అమరావతిని రాజధానిగా ఉంచుతూ అభివృద్ధి చేస్తే మరోసారి గెలిపించుకుంటామని తేల్చి చెపుతున్నారు.

ఇక నిన్న బొమ్ములూరు మీదుగా మహాపాదయాత్ర గుడివాడలోకి ప్రవేశించింది. అక్కడి శరత్‌ థియేటర్‌ సెంటర్‌ వద్ద కొంకితల ఆంజనేయ ప్రసాద్‌, మరో ఇద్దరు వైస్సార్సీపీ నేతలు పాదయాత్ర చేస్తున్న రైతులను, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని రెచ్చగొడుతూ తొడలుచరిచారు. దీనిని తట్టుకోలేకపోయిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు…. వచ్చే ఎన్నికల్లో మీసంగతి చూస్తామంటూ చెప్పును తీసి చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.