నన్నే ఆపుతారా..ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నేను తెలంగాణకు కాబోయే సీఎంను!: కేఏ పాల్

చండూరులో కేఏ పాల్ ప్రచారం..పాల్ వాహనాన్ని నిలిపివేసిన అధికారులు

KA paul
KA paul

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అధికారులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోగా, ఆయన వారిపై చిందులేశారు. చండూరులో ప్రజాశాంతి పార్టీకి చెందిన రెండు ప్రచార వాహనాలు ముందు వెళుతుండగా, వాటి వెనుక కేఏ పాల్ వాహనం వస్తోంది. అయితే కేఏ పాల్ వాహనాన్ని అధికారులు నిలిపివేశారు.

దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్… నన్నే ఆపుతారా… ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నేను తెలంగాణకు కాబోయే సీఎంను… రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని, తాను అనుమతి తీసుకునే ప్రచారం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, తనను ఆపిన అధికారిని నీ పేరేంటని ప్రశ్నించారు. ఆ అధికారి చెప్పకపోయేసరికి మెడలోని ఐడీ కార్డు పట్టుకుని అందులోని పేరును చూసే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఇతర అధికారులు జోక్యం చేసుకుని కేఏ పాల్ కు సర్దిచెప్పడంతో ఈ వ్యవహారం అంతటితో ముగిసింది. కేఏ పాల్ తన అనుచరులతో కలిసి అక్కడ్నించి వెళ్లిపోయారు.