ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

సౌర, పవన శక్తి వినియోగంలోకి తీసుకురావాలి

The Alternative energy sources
The Alternative energy sources

ప్రపంచవ్యాప్తంగా ఇప్పు డిప్పుడే సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడ కంపై అవగాహన పెరుగుతు న్నది.

దశాబ్దకాలం ముందు ప్రపంచం మేల్కొని ఉంటే ప్రస్తుతం నెలకొంటున్న అవాంఛనీయ పరిణామాలకు ఆస్కారం ఉండేది కాదు.

పర్యావరణ సంబంధిత సమస్యలే కాకుండా తరిగిపోతున్న సాంప్ర దాయ ఇంధన నిక్షేపాలను కాపాడుకుని ఉండేవారం.

ఏ దేశమైనా అభివృద్ధి బాటలో పయనించాలన్నా, అందరికీ ఉపాధి అవకాశాలు కావాలన్నా మనకు ఆయా దేశాల్లో పారిశ్రామిక, సాంకేతిక, రవాణా, వ్యవసాయ, సేవా రంగాలలో విప్లవాత్మక మార్పులు రావాలి.

ఈ రోజుల్లో ప్రతిరంగం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. ప్రతి రంగాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడేది ‘శక్తి మండటం వలన శక్తినిచ్చే ఇంధనంపైనే మన అవసరాలన్నీ ఆధారపడి ఉన్నాయి.

ఈ అవసరాలను గుర్తించే మన శాస్త్ర వేత్తలు అనేక పరిశోధనలు జరిపి మనకు విభిన్న రకాలైన ఇంధన వనరులను వినియోగంలోకి తెచ్చారు.

వారి పరిశో ధనల పర్యవసానమే అన్ని రంగాలు ముందంజలో దూసుకుపోతున్నాయి. పెరుగు తున్న ప్రపంచ జనాభాకు కొంతవరకైనా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

రవాణా రంగం రకరకాలుగా మార్పులు చెంది వస్తు రవాణా చేస్తూ, ప్రజలకు చేరువైంది

ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, లారీలు, బస్సులు, రైల్వేలు, వైమానిక, నావికా రంగం ఒకటేమిటి సర్వ వ్యవస్థలు ఇంధనం మీదనే నడుస్తు న్నాయి. ఇంధన వనరులు లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో ఊహకందని విషయం.

అయితే క్రమేపీ మనం వాడుతున్న ఇంధన వనరులు తరిగి పోవడమే కాకుండా పలురకాల పర్యా వరణ సమస్యలను తెచ్చిపెట్టాయి.

వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నది. కలుషిత ఉద్గారాలవల్ల గాలి కాలుష్యం, జల కాలుష్యం జరిగి మానవుడు రోగాల పాలవుతున్నాడు. భూతాపం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రపంచమంతా గ్లోబల్‌ వార్మింగ్‌పై గగ్గోలు పెడుతున్నది. చెట్లను నరికి, వాటిని కూడా ఇంధనంగా వాడడం వలన గాలిలో అవాంఛనీయ వాయువ్ఞలు పెరిగిపోయాయి. మనం పీల్చే గాలి స్వచ్ఛతను కోల్పోయింది.

ప్రాణాధార ఆక్సిజన్‌ పరిమాణం తగ్గిపోయింది. జలకాలుష్యం వలన తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి తాగునీటిని శుద్ధి చేసే యంత్రాలొచ్చాయి.

మన అవసరాలను ఆధారం చేసుకుని, తాగునీరు కొంత మందికి ప్రధాన ఆదాయ వన రుగా వ్యాపారాత్మకమైన అంగడి సరుకుగా మారిపోయింది.

ఇక మున్ముందు నీటి వలే గాలి కూడా పెద్ద వ్యాపారంగా మారు తుందనడంలో సందేహం లేదు.

కలుషిత గాలికి ప్రత్యామ్నా యంగా కొన్ని దేశాలలో స్వచ్ఛమైన గాలిని బంధించి విక్రయించడం కూడా జరుగుతున్నది.

అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో నీటి శుద్ధి యంత్రాల వలే గాలి శుద్ధి ప్లాంట్లు కూడా ఆవిర్భవించక తప్పదు.

భవిష్యత్తులోఎదురయ్యే ఇంధన వనరుల సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం తప్పనిసరి.

నార్వే లాంటి దేశాలు ఇప్పటికే పునరుత్పాదక వినియోగ ఇంధనాలను ఉపయోగించి విద్యుదు త్పత్తిని చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

ఆస్ట్రేలియా లాంటి దేశాలు విద్యుత్‌తో నడిచే వాహనాలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి, శిలాజ ఇంధనాలైన పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా నడిచే వాహనాలను అరికట్టి, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌ లాంటి ఉద్గారాల విడుదలకు కొంతవరకు అడ్డుకట్ట వేయడం జరిగింది.

సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో దూకుడుమీదున్న అమెరికా కూడా బయో ఇంధనాల వాడకంపై దృష్టి పెట్టడం ముదావహం.

భూతాపం అనేది మిథ్యగా భావించిన అమెరికా కూడా వాస్తవ పరిస్థితు లను గమనించడం హర్షదాయకం. శిలాజ ఇంధనాలు కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే. ఇవి ఏర్పడడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది.

ఇవి తరిగిపోవడానికి ఎంతో సమయం అవసరం లేదు. బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ప్రపంచం ఈ రకమైన ఇంధన వనరులు పరిసమాప్తమైన తర్వాత కుప్పకూలిపోకతప్పదు.

ప్రపంచ అభివృద్ధి రథచక్రాల నడక ఆగిపోక తప్పదు. ప్రపంచం దారుణమైన అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అందుకే అన్ని దేశాలు మొద్దునిద్ర వీడుతున్నాయి.

రాబోవు విపత్కర పరిణామాలపై దృష్టిపెడుతున్నాయి. అయితే ఈ కృషి సరిపోదు.

ఒకసారి వినియోగానికే తప్ప పునరుత్పత్తికి, పునర్వినియోగానికి పనికిరాని సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి సౌరశక్తి పవన శక్తి, తరంగశక్తి వంటి కాలుష్య రహితమైన సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించాలి.

బయో ఇంధనాల వాడకం వలన కూడా చాలావరకు హానికారక ఉద్గారాల శాతాన్ని తగ్గించవచ్చు.

చైనా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి దేశాల్లో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఖతార్‌, ఇరాన్‌, అమెరికా, రష్యా దేశాల్లో సహజ వాయు నిక్షేపాలు అధికం.

గల్ఫ్‌ దేశాలు ఆర్థికంగా ముందంజలో ఉండటానికి ప్రధానమైన కారణం అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న చమురు నిక్షేపాలే కారణం.

అయితే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదా లను ఊహించి, తరిగిపోయే ఇంధన వనరులను త్యజించి కాలుష్యరహితమైన ఇంధన వనరులపై దృష్టి సారించాలి.

భారతదేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు, చమురు నిక్షేపాలున్నాయి. అయితే వీటిని వెలికితీసి, ఉత్పత్తి చేయడం తలకుమించిన భారం. వ్యయంతో కూడుకున్న వ్యవహారం.

జార్ఖండ్‌, ఒడిశా, బెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉండగా గుజరాత్‌, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.

అయినప్పటికీ మనదేశం సౌరశక్తి వాయుశక్తి ఆధారిత విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించడం శుభపరిణామం. సాంప్రదాయ ఇంధనవనరులకు స్వస్తిచెప్పి సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించాలి.

అన్నింటికంటే సౌరశక్తిని విద్యుత్‌గా మార్చడం శ్రేయస్కరం.

ఇది కాలుష్యరహితం. పర్యావరణ సంరక్షణకు ఉత్తమమైన ఇంధన వనరు ‘సౌరశక్తి, పవనశక్తిని కూడా వినియోగంలోకి తీసుకురావాలి.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/