ముఖం మెరిసేందుకు ఆలూ పూత

మనకు ఎదురయ్యే కొన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి ఖరీదైన పూతలే అవసరం లేదు. బంగాళాదుంపచాలు. ఈ దుంపను చక్రాల్లా కోసి శుభ్రమైన పలుచని వస్త్రంలో చుట్టి కంటిపై 20 నిమిషాలు పెట్టుకోవాలి. కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు పోతాయి. కళ్లు అలసటగా అనిపించినప్పుడు బంగాళాదుంప ముక్కల్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లపై పెట్టుకున్నా ఫలితం కనిపిస్తుంది.
వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండాలంటే ఆలూను ముద్దగా నూరి అందులో చెంచా పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఇరవై నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చూసుకోవచ్చు. ఆలూ ముద్ద నీరంతా కారిన ఆ నీటిలో పావు చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి.
ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంలో సాగే గుణం పెరిగి, ముడతల సమస్య ఉండదు. అదే రసానికి రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, బియ్యం కడిగిన నీటిని కలిపి ముఖానికి రాసి, ఆరనిచ్చి శుభ్రపరచుకోవాలి. ముఖంపై ఉన్న మచ్చలు చాలామటుకు తగ్గుతాయి. నిమ్మరసానికి బదులు తేనె వాడితే ముఖం తాజాగా ఉంటుంది.
కీర దోస, బంగాళా దుంప ముక్కలను మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమానికి పావు చెంచా వంటసోడా, నీరు కలపాలి. దీన్ని శుభ్రమైన సీసాలోకి తీసుకుంటే వారం, పదిరోజుల పాటు సహజ క్లెన్సర్‌గా వాడుకోవచ్చు. సహజ పూతకు సగం బంగాళాదుంపను ముద్దలా చేసి అందులో గుడ్డు తెల్లసొన కలపాలి. బ్రష్‌తో దీన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చాలు. అప్పటి కప్పుడు ముఖం మెరుపులీనుతుంది. మృతకణాలు పూర్తిగా పోతాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/