ఎలర్జీ సమస్యలు

చాలా మందిని బాధించే సమస్యల్లో ఎలర్జీ ఒకటి. ఉన్నట్లుండి దురద మొదలై ఒళ్లంతా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. ఈ సమస్య ఎందుకు వస్తుందో చెప్పలేం. కాని అందుకు పరిష్కారాలు మాత్రం తెలుసుకోవాలి. శరీరమంతా ఎర్రని దద్దుర్లు రకరకాల సైజుల్లో ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లుగా కూడా ఉంటుంది.

మరికొందరిలో అయితే దురదలు వచ్చిన ఓ గంటలోపే తగ్గుతాయి. కొంతమందికి తగ్గేందుకు రెండు రోజులు పడుతుంది. శరీరానికి పడని ఆహారపదార్థాలు, మందులూ, సౌందర్యసాధనాలు, దుమ్ము, ధూళి, పూలపుప్పొడి వంటివి ఇందుకు కారణం కావచ్చు.

ఏ కారణం వల్ల ఎలర్జీ వచ్చినా ఈ పదార్థాలను కొంతకాలం దూరం పెట్టడం మంచిది. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌, వేరుశనగ, జీడిపప్పు, బాదం, చేపలు, గుడ్లు, చాక్లెట్లు, ఆహారంలో కలిసే రసాయనాలు కూడా ఎలర్జీకి కారణం కావచ్చు. వీటిలో ఎటువంటి పదార్థాలు ఎలర్జీని కలిగిస్తున్నాయో గుర్తించగలిగితే వాటిని మానేయాలి. ముఖ్యంగా రసాయనాలు

చేర్చే ఆహారానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. పుదీనా, నిమ్మరసం ఎక్కువగా వాడాలి. మంచినీళ్లు, కమ్మటి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/