బీఆర్ఎస్‌ను స్వాగతించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించారు. దసరా సందర్బంగా జాతీయ పార్టీ ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రజలు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే మద్దతు ప్రకటిస్తూ స్వాగతిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలు బీఆర్ఎస్‌ను స్వాగతిస్తున్నట్లు తెలుపగా, తాజాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్వాగతిస్తున్నద‌ని ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా భారత్‌ రాష్ట్ర సమితిని బలపర్చాల్సిన‌ అవసరం వుంద‌న్నారు. చిరకాలంగా కేంద్రంలో కొనసాగుతున్న ఉత్తరాది ఆధిపత్యానికి విరుగుడుగా, గుజరాతీ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి, కేవలం అదానీ, అంబానీలకు గులామ్ గిరి చేస్తూ దేశాన్ని, జాతీయ సంపదలను కార్పోరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు దక్షిణాది నుండి మన తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు రావడం గొప్ప విష‌య‌మ‌న్నారు. కేసీఆర్ నాయకత్వంలోని భార‌త్ రాష్ట్ర స‌మితి జాతీయ రాజకీయాల్లో సమర్ధవంతమైన పాత్ర పోషించగలదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.