నేడు ఏపీకి జేపీ నడ్డా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ఈరోజు , రేపు (6,7 తేదీల్లో) ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈరోజు విజయవాడలో, రేపు రాజ‌మండ్రిలో జ‌రిగే స‌భ‌ల్లో న‌డ్డా పాల్గొనబోతున్నారు. విజయవాడలో రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇన్‌చార్జిల‌తో భేటీ కానున్నారు. సాయంత్రం సిటీలో జరిగే మేధావుల సమావేశంలో పాల్గొంటారు. రేపు రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.

ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బిజెపి శక్తి కేంద్రాలుగా మార్చింది. వాటికి ఇన్చార్జీలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆయా శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో విజయవాడలో నడ్డా బేటీ అవుతారు.ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పురప్రముఖులు తో నడ్డా సమావేశం కానున్నారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశం అవుతారు. అందులో పార్టీ భవిష్యత్, వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రికి విజయవాడలోనే బస చేయనున్న నడ్డా.. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు.

మరోపక్క రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయమై జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మూడు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ త‌రుణంలో బీజేపీ చీఫ్ నడ్డా ఏపీ పర్యటనకు రావ‌డం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ‌స్‌గానే ఫోక‌స్ చేస్తోంది. అందులో భాగంగా వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.