ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

లాక్‌డౌన్‌కు ముందు బుక్ చేసుకున్న విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు

Air India flight
Air India flight

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో నెలల ముందు విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా లాక్‌డౌన్‌కు ముందు బుక్ చేసుకున్న విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది. సంస్థ ప్రకటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 15 మార్చి నుంచి 24 ఆగస్టు మధ్య టికెట్లు బుక్ చేసుకున్న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ గడువు పెంపు వర్తిస్తుందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

ప్రయాణతేదీ, విమానం, రూట్, బుకింగ్ కోడ్‌ను ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించకుండానే మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, వచ్చే ఏడాది డిసెంబరు 31లోపే బుకింగ్ తో పాటు ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుందని వివరించింది. రూట్ మార్చుకోవాలనుకుంటే టికెట్ ధరకు అనుగుణంగానే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ మొదట బుక్ చేసిన దానికంటే తక్కువ ధరకు టికెట్లు బుక్ చేస్తే మిగతా డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని, టికెట్ రేటు ఎక్కువగా ఉంటే మాత్రం ఆ మేరకు వసూలు చేస్తామని స్పష్టం చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/