రికార్డ్ ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు – అల్లు అర్జున్

Ala Vykuntapuramlo success meet

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “నా ఫస్ట్ సినిమా ఇక్కడ (వైజాగ్) షూట్ చేశాను. ఇప్పటికి ఇరవై సినిమాలు చేశాను. నా విజయం, నా జర్నీ ఎప్పుడూ వైజాగ్ ప్రజలతోనే ఉంది. మళ్లీ వైజాగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరు నాతో ‘ప్రతి ఒక్కరికీ ఒక కంచుకోట ఉంటుంది. మీ కంచుకోట వైజాగ్ అండీ’ అన్నారు. నిజంగా అది కలెక్షన్లు చూస్తే తెలుస్తుంది. థాంక్యూ వెరీ మచ్ వైజాగ్. నా మొట్టమొదటి థాంక్యూ తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఫోన్లో వొచ్చేస్తున్నాయ్, టీవీలో వచ్చేస్తున్నాయ్, థియేటర్లకు జనం రావట్లేదు అనే టైంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, మేం తెలుగువాళ్లం అందరం కలిసికట్టుగా థియేటర్లకు వచ్చి చూస్తాం.. అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలాంటి ఆల్బం కావాలని తమన్ అడిగాడు. 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బం కావాలన్నాను. నిజంగా తను 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు అతనికి థాంక్స్. ‘సామజవరగమన’ పాటతో ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. ప్రపంచమంతా ఇది అతనికిచ్చిన బిరుదు. అలాగే ‘రాములో రాములా’తో ‘చార్ట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు.
ఈ ఉత్సవంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ “ఆర్ట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా ‘ఆర్య’. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు నేను వేసిన సెట్స్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ” అన్నారు. నటుడు అజయ్ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక మ్యాజిక్. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ నాకు చాలా బాగా నచ్చాయి. బన్నీ ఈ సినిమాని తన భుజాలపై మోసుకువెళ్లారు” అని తెలిపారు. ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ “బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చినబాబు గారు తనపేరును పెదబాబుగా మార్చుకోవాలి. అలాగే మా గురువు, బావగారు అల్లు అరవింద్ గారు బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీని నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం ఇది. అరవింద్ గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.

హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమా సక్సెస్ గురించి ఇదివరకే ఇంటర్వ్యూల్లో మాట్లాడేశాను. అదే విషయాన్ని మళ్లీ తెలుగులో చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక సినిమాకి సక్సెస్ రావాలంటే అది టీం ఎఫర్ట్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే మా మొత్తం బృందానికి కంగ్రాట్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు థాంక్స్. నన్ను ఇంత అందంగా చూపించినందుకు థాంక్స్. ‘బుట్టబొమ్మ’ పాట మొత్తం నామీద రాసినందుకు థాంక్స్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ‘ఆరా’ను అల్లు అరవింద్ గారిలో చూస్తున్నాను.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా నాన్న అల్లు రామలింగయ్య గారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ‘శంకరాభరణం’కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాని వంద సంవత్సరాలు ఉంచుతారు. ఇది వాస్తవం. నేను కర్నూలులో ఈ సెలబ్రేషన్స్ పెట్టుకుందామని బన్నీతో అంటే, నాకు ‘వైజాగే కావాలి’ అన్నాడు. కోట్లాది మంది చూసిన సినిమాలో బన్నీ ఎలా చేశాడో చెబితే అపహాస్యంగా ఉంటుంది. మాకు కడుపు నిండిపోయింది. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే మాట తక్కువగా అనిపిస్తుంది. అతను మాటల మాంత్రికుడు కాదు, సెల్యులాయిడ్ తాంత్రికుడు. తాంత్రికుడు మనను మాయలో ఉంచేస్తాడు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “నేను వైజాగ్ లోనే చదువుకున్నా. వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్. శ్రీశ్రీ, చలం గారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రి గారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది అని చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/