హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ..కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. మల్కాజిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రేవంత్ రెడ్డికి మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

గత కొంత కాలంగా ఆకుల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజీగా ఉన్న తరుణంలో… ఆకుల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆకుల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆకుల రాజేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య శిష్యుడు. ఆకుల రాజేంద‌ర్ 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతల కనకారెడ్డి పై 9195 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆకుల రాజేంద‌ర్ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాడు. ఆయనకు 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ దక్కలేదు. ఆకుల రాజేంద‌ర్ 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.