కేటీఆర్ కు సవాళ్లు విసిరిన ఎంఐఎం, బిజెపి నేతలు

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, బిజెపి నేత రఘునందన్ రావు సవాళ్లు విసిరారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ముఖ్యంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ – కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. అలాగే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సైతం కేటీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎంఐఎం పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీతో చర్చిస్తామని తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏడుగురుతో కాకుండా కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతామని అక్బరుద్దీన్‌ ధీమా వ్యక్తం చేసారు.

అలాగే దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సైతం కేటీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సభలో కేటీఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రఘునందన్ ఆరోపించారు. తనను గెలిపించారన్న అక్కసుతో కేసీఆర్ దుబ్బాకకు డిగ్రీ ఇవ్వలేదని, రింగ్ రోడ్డు కూడా మంజూరు చేయలేని వాపోయారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని రఘునందన్ హామీ ఇచ్చారు.