అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతున్నది

ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ అజిత్‌ దోవల్

హైదరాబాద్: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఈ రోజు హైదరాబాద్ వ‌చ్చారు. హైద‌రాబాద్‌లోని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్ జాతీయ పోలీస్‌ అకాడమీలో 73వ బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్ జ‌రుగుతోంది. ఇందులో అజిత్ దోవ‌ల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ బ్యాచ్‌లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్‌ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలంగాణ కేడర్‌కు నలుగురు, ఏపీ కేడర్‌కు ఐదుగురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మంది ప్రొబేషనరీలకు అజిత్‌ దోవల్ ట్రోఫీలు అంద‌జేశారు.

ఈసందర్బంగా అజిత్‌ దోవల్ మాట్లడుతూ…అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతున్నదని, మరో రెండు దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే కీలకపాత్ర పోషించనుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అన్నారు. చట్టాలు చేయడమే గొప్ప విషయం కాదని, వాటిని పరిరక్షించి, అమల్లోకి తీసుకువచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. ట్రైనీ ఐపీఎస్‌ల కవాతు ఎంతో ఆకట్టుకున్నదని చెప్పారు. పరేడ్‌కు మహిళ నేతృత్వం వహించడం సంతోషకరమన్నారు.

ట్రైనీ ఐపీఎస్‌లు దేశానికి సేవ చేయబోతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎస్‌వీపీఎన్‌ఏలో 5700 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారని వెల్లడించారు. ఎంతోమంది ఐపీఎస్‌లు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. 52 ఏండ్ల క్రితం ఎన్పీఏ నుంచి శిక్షణ తీసుకుని విధుల్లో చేరానని గుర్తుచేసుకున్నారు. 130 కోట్ల మంది ప్రజలనే కాకుండా, 32 లక్షల చదరపు కిలోమీటర్ల భారతదేశ భూభాగాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత యువ ఐపీఎస్‌లపై ఉందన్నారు.

అంత‌కుముందు, శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌ల నుంచి దోవల్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌కు ఈ సారి కూడా మహిళా అధికారి కమాండర్‌గా వ్యహరించారు. కాగా, శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ 149 మందిలో 132 మంది ఐపీఎస్‌లు, 17 మంది ఫారెన్‌ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/