అజాత శత్రువు
ఆధ్యాత్మిక చింతన

అజాతశత్రువు అనగానే మనకు మహాభారతంలోని ధర్మరాజు గుర్తుకొస్తాడు. కౌషీతకీ ఉపనిషత్ వివరణమగు ఆత్మపురాణంలో కాశీరాజున గురించి ఉంది. ఆయన పేరు కూడా అజాతశత్రువు.
ఆయన సకలధర్మాత్మ పురుషులందు ప్రముఖుడు, వినయవిధేయత గలవాడు, సత్యమందు స్థితిగలవాడు, మహాత్ముల సేవలో ఆనందం పొందేవాడు.
తన బలంకన్నా అధికబలం గల శత్రువ ఎవడూ భూమండలంలో లేకపోవటం వల్ల అజాత శత్రువు అని పేరు పొందినవాడు అంతేకాక కామక్రోధాది శత్రువులు కూడా లేనివాడు, సకల జనులందు, సకల పదార్ధంలందు సమభావం గలవాడు.
క్షత్రియుడై భుజబలమును, జ్ఞానయై ఆత్మతత్త్వమును పొందినవాడు. గర్గగోత్రం గల ‘బలాక అను బ్రాహ్మణుడుండే వాడు. ఆయన షడగసహిత నాలుగువేదములను అధ్యయనం చేసినవాడు.
ఆయన కుమారుడు ‘బలాకి. సర్వశాస్త్రాలను చదివి తండ్రికి మించిన తనయుడయ్యాడు. అయితే తండ్రిలో వికసించిన వినయం లోపించింది, గర్వం విజృంభించింది బలాకిలో.
నేను సర్వబ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడను, నాడే సమానంగా ఎవడును విద్వాసుడు లేడు అని భావించసాగాడు. విద్యామదం, ధనమదం, యవ్వనమదం ఇన్ని దుర్గుణాలకు లోనై బ్రాహ్మణధర్మమందు నిష్ఠ కలుగలేదు.
వేయి చేతులు గల బాణాసురుడు తన భుజబలాన్ని తలచుకొని గర్వించి సరాసరి మహాదేవు ని వద్దకేవెళ్లి నమస్కరించి ‘దేవా! నీవు నాకు వేయి చేతులు ప్రసాదించావు.
వాటితో కొండలను పిండిచేశాను, మదించిన ఏనుగుల గుంపులను పీనుగలుగా మార్చాను. అయినా నాకు యుద్ధకండూతి తగ్గలేదు.
నాతో సమానబలం కలవాడిని చూపించు అని కోరాడు. (పుట 764-భాగవతసుధ, రామకృష్ణ తపోవనం-చెన్నై) అలాగే బుద్ధిబలం, వాదనపటిమ, పాండిత్యం వ్ఞన్నవారికి ఇంకొంత ఎక్కువే అహంకారముంటుంది.
ఎప్పుడూ ఎవరితోనైనా శాస్త్రచర్చ చేయాలని, వాదించాలని, ఓడించాలని ఉబలాటపడుతుంటారు. అలాంటి మిళిందుడనే రాజు నాగసేనుడు అను బౌద్ధ గురువును కలిసి, వాదించి, ఓడి ఆయనకు శిష్యుడైన విషయాన్ని మనకు చరిత్ర తెలుపుతుంది.
సరిగ్గా అలాగే జరిగింది బలాకి జీవితంలోనూ. ఆయన హిమాచలము నుంచి రామేశ్వరము వరకు కురు పాంచాల కాశీ మిధిల మొదలగు క్షేత్రాలలో సంచరించి అక్కడి ఇతులను చర్చకు పిలిచాడు, సవాలు చేశాడు, ఓడించాడు.
తాను జగదేకపడితుడని విర్రవీగాడు. శాస్త్రచర్చకు మూడు రూపాలుంటాయి. 1 జల్పం అంటే ఉచితాను చితములను పాటింపక తన పక్షమున మండనము, ఎదుటిపక్షమున ఖండనము చేయవిధానం 2. వితండము అంటే కేవలం ఎదుటిపక్షము వారి చర్చను ఖండించటం 3 వాదం-నిర్మలమైన మనస్సుతో తత్త్వనిర్ణయం చేయుట. ఆత్మజ్ఞానం లేక కేవలం శాస్త్రజ్ఞానం, పాండిత్యం గలవారు సాధారణంగా చర్చలో జల్పాన్ని, వితండవాదాన్ని అనుసరిస్తారు.
ఏదోలా తమ వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని మట్టికరిపిస్తారు. బలాకి కూడా ఆ కోవకు చెందినవాడే కావటంతో అన్ని క్షేత్రాల్లో, పండితులందర్నీ ఓడించి చివరకు కాశీక్షేత్రంలోని పండితులను ఓడించాడు. కాశీ రాజు అజాతశత్రువ్ఞ కూడా పండితేడే అని తెలిసికొని అతనిని జయించాలని తలిచాడు. ఆయన్ను కలిసి ‘ఓ రాజా! నీవ్ఞ బ్రహ్మజ్ఞాన రహితుడవ్ఞ నీకు నేను బ్రహ్మూెపదేశం చేస్తాను అన్నాడు.
తన తెలుసుకొన్న విషయాన్నంతా ఏకరువుపెట్టాడు. ఇదంతా నాకు ముందే తెలుసు, ఇంకా ఏమి ఉందో చెప్పమన్నాడు రాజు. నాకు తెలిసినది అంతే అన్నాడు బలాకి.
అప్పుడు రాజు తనకు తెలిసిన విషయాలను వివరిస్తే బలాకి ఆ రాజునే తన గురువుగా స్వీకరించి తలవంచాడు.
రాజు బలాకి చేతిని పట్టుకొని రహస్యార్థాన్ని సభలో ఉపదేశించరాదని తన అంతఃపురంలోకి తీసుకెళ్లి ఉపదేశముచేశాడు (పుటలు 18,1920 ధర్మోపన్యాసాలు, 3వ భాగం) శాస్త్రాలలోని ప్రతి పదానికి అర్ధం, తాత్పర్యం తెలియటం విద్య కాదు. వాటి తత్త్వం తెలియాలి
. అది తెలిస్తే వినయం కల్గుతుంది. అందుకే విద్యయొసగును వినయంతో అన్నారు. నిజమైన విద్యావంతుడు చర్చలకు సవాలు విసరడు. మౌనాన్ని ఆశ్రయిస్తాడు, అందిదరీ గౌరవిస్తాడు.
- రాచమడుగు శ్రీనివాసులు
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/