రొమేనియా నుంచి 219 మంది భార‌తీయుల‌తో బయల్దేరిన విమానం

విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ వెల్ల‌డి

న్యూఢిల్లీ : ర‌ష్యా బాంబు దాడుల‌తో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ఉక్రెయిన్ నుంచి భార‌తీయులను సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చే ప‌నిలో భార‌త విదేశాంగ శాఖ పురోగ‌తిని క‌న‌బ‌ర‌చింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకుంటూ సాగుతున్న భార‌త విదేశాంగ శాఖ యుద్ధ‌భూమిలో చిక్కుకున్న భార‌తీయుల్లో 219 మందిని విమానం ఎక్కించేసింది. ఈ విమానం అక్క‌డి నుంచి ముంబైకి టేకాఫ్ కూడా తీసుకుంది. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఫొటోల‌ను కూడా విడుద‌ల చేశారు.

భార‌త విదేశాంగ శాఖ సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తూ రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకున్న 219 మంది భార‌తీయుల‌ను విమానం ఎక్కించేసిన అధికారులు విమానాన్ని ముంబైకి పంపారు.ఈ విష‌యాన్ని తెలిపిన జైశంక‌ర్‌.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయులు అంద‌రినీ సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నాన‌ని కూడా ఆయ‌న తెలిపారు. భార‌తీయుల త‌ర‌లింపులో మెరుగైన స‌హ‌కారం అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/