ఇకపై హైదరాబాద్‌ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు

జనవరి 15 నుండి అందుబాటులోకి..షికాగోకు నడుపనున్న ఎయిరిండియా

ఇకపై హైదరాబాద్‌ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు
international-flights-air-india-announces-direct-flights-to-us-from-hyderabad-from-jan-15-detail

హైదరాబాద్‌: ఇక పై హైదరాబాద్‌ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. జనవరి 15వ తేదీన శంషాబాద్‌ జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి షికాగోకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-షికాగో మధ్య 238 సీట్ల విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. షికాగోకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండడంపై జీఎంఆర్ విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు నడిపేందుకు శంషాబాద్ విమానాశ్రయం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నిజానికి హైదరాబాద్, అమెరికా మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. అయితే, అందుకు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేవు. దీంతో నగరం నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు కనెక్టింగ్ సర్వీసులతో అమెరికా చేరుకుంటున్నారు.
దీంతో హైదరాబాద్‌ నుండి షికాగో సర్వీసు ప్రారంభం కానుంది. ఈ సర్వీసులో 238 సీట్లు అందుబాటులో ఉంటాయి. తొలుత వారానికోసారి ఉంటుందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/