హోలీ..ఎయిమ్స్‌ వైద్యనిపుణుల హెచ్చరిక

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడి హోలీ వేడుకలు జరుపుకోవద్దు

AIIMS - Holi
AIIMS – Holi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం హోలి పండుగపై కూడా పడింది. ఈనేపథ్యంలో ఢిల్లీలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్య నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడి హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల ఊపరితిత్తులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముందని ఎయిమ్స్‌ డైరెక్టరు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. దేశంలో 39 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన దృష్ట్యా … ప్రజలు హోలీ ఆడవద్దని డాక్టర్‌ రణదీప్‌ కోరారు. ప్రజలు హోలీ ఆడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఎన్‌ 95 మాస్క్‌లు వాడాలని డాక్టర్‌ సూచించారు.

జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులతో కలిసి హోలీ ఆడితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా ఇన్పెక్షన్‌ సోకే ప్రమాదముందని ఎయిమ్స్‌ సీనియర్‌ చెస్ట్‌ స్పెషలిస్టు డాక్టర్‌ ఆశిష్‌ జైస్వాల్‌ చెప్పారు. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తికి ఆరు మీటర్ల దూరంలో ఉండాలని అందుకే ఈ ఏడాది ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని డాక్టర్‌ ఆశిష్‌ సూచించారు. ప్రజలు హోలీ వేడుకల్లో పాల్గంటే ఇన్ఫెక్షన్లు త్వరగా ప్రబలే అవకాశముందని, దీనివల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోస సమస్యల బారినపడే ప్రమాదముందని ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ రమణ కుమార్‌ చెప్పారు. హోలీ రంగుల్లో కెమికల్స్‌ ఉంటాయని, దీనివల్ల అలర్జీలు, చర్మ సంబంధ సమస్యలు ఏర్పడవచ్చని డాక్టర్‌ రమణకుమార్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాది హోలీ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని డెర్మటాలిజిస్ట్‌ డాక్టర్‌ విధూషీ జైన్‌ కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/