మునుగోడు ఆశావాహులను సంతృప్తి చేసిన ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఆ పార్టీ కి , పదవికి రాజీనామా చేయడం తో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలతో పాటు సిపిఐ కూడా భావిస్తుంది. దానికి తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా మునుగోడు స్థానం కోసం కాంగ్రెస్ నుండి అనేక మంది పోటీ పడుతుండడం తో ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు మునుగోడు ఆశావాహులతో మాట్లాడాడారు.

కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ ఐక్యంగా పని చేసి, అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని ఆశావాహులకు సూచించారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మునుగోడులో మండలాల వారీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆశావాహులను బోస్ రాజు ఆదేశించారు. మునుగోడు టిక్కెట్ ను ఆశిస్తున్న నాయకులను పిలిచి అన్ని విషయాలపై ఆరా తీశామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ కలిసి పని చేయాలని ఆదేశించామన్నారు. ఏఐసీసీ నేతలతో మరోసారి సమావేశం ఉంటుందని వివరించారు.