ద్వేషం, విభజన రాజకీయాలతో నాన్నను కోల్పోయాను.. దేశాన్ని కోల్పోను : రాహుల్ గాంధీ

నేటి నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం..

ahead-of-yatra-rahul-gandhi-offers-floral-tributes-at-his-fathers-memorial-in-sriperumbudur

చెన్నైః కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సుధీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్‌ జోడో యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం సాయంత్రం ఈ యాత్ర ప్రారంభంకానుంది. అయితే దానికి ముందు రాహుల్ గాంధీ ఇవాళ శ్రీపెరంబ‌దూర్‌లో ఉన్న మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు త‌న తండ్రి బ‌ల‌య్యాడ‌ని, కానీ అటువంటి విద్వేష రాజ‌కీయాల‌కు దేశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేన‌ని రాహుల్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ద్వేషాన్ని ప్రేమ జ‌యిస్తుంద‌ని, భ‌యాన్ని ఆశ జ‌యిస్తుంద‌ని, క‌లిసిక‌ట్టుగా మ‌నం అన్నింటిలో విజ‌యం సాధిస్తామ‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

ఈ భారత్ జోడో యాత్ర సుమారు 3,570 కి.మీ మేర సాగనుంది. 12 రాష్ట్రాల్లో దాదాపు 148 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్‌ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ యాత్రలో అగ్రనేతలతో సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొననున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌ పాల్గొననున్నారు. తరువాత మహాత్మగాంధీ మండపం నుంచి నుంచి సుధీర్ఘ పాదయాత్ర ప్రారంభం కానుంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. భారతదేశ చరిత్రలో రాహుల్‌ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. దేశంలో విభజనవాద రాజకీయాలు, మతోన్మాదంతోపాటు పెరిగిపోతోన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించి.. దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/