నేడు స్వదేశానికి తిరిగొస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్

తన తండ్రిని ఎవరు కలిసినా మాస్క్ పెట్టుకోవాలని కోరిన రోహిణి ఆచార్య

Ahead of Lalu Yadav’s return to India post kidney transplant, daughter Rohini’s emotional appeal

న్యూఢిల్లీః బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ మూత్రపిండాల మార్పిడి చికిత్స అనంతరం శనివారం స్వదేశానికి చేరుకోనున్నారు. లాలూ ప్రసాద్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి భారత్ కు వస్తున్న తరుణంలో ఆయన ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోహిణి ట్విట్టర్ లో వెల్లడించారు.

‘‘పాప పట్ల మీ ప్రేమ హద్దుల్లేనిదని తెలుసు. నాన్న భారత్ కు వచ్చేసిన తర్వాత ఎవరైనా ఆయన్ను కలవాలని అనుకుంటే మాస్క్ ధరించి, ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి’’అని రోహిణి అభిమానులను కోరింది. మరో ట్వీట్ లో (మీరు ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని వైద్యులు తన తండ్రికి సూచించినట్టు చెప్పారు. తన తండ్రి ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆమె తెలియజేశారు.

గతేడాది డిసెంబర్ 5న లాలూకి సింగపూర్ వైద్యులు కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలిసిందే. రెండు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో మరో మార్గం లేక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ నిర్వహించారు. తండ్రి పట్ల రోహిణి ఆచార్య చూపించిన ప్రేమను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. ‘‘కుమర్తెలు అందరూ రోహిణి మాదిరే ఉండాలి. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. భవిష్యత్తు తరాలకి నీవు ఒక ఉదాహరణ’’అని గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.