స్థానిక సంస్థల ఎన్నికల కోసం ‘నిఘా’ యాప్‌

ఫిర్యాదు వెళ్తే అభ్యర్థిపై అనర్హత వేటు

AP CM Jagan launches NIGHA App
AP CM Jagan launches NIGHA App

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు గురి చేసే వారిపై ప్రభుత్వం కొరడా ఘులిపించనుంది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఇవాళ తాడేపల్లిలోని తన నివాసంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనుకునేవారిని ప్రోత్సహించడంతో పాటు, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నివారించి, అవినీతికి అడ్డుకటువేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలసంఘం, పోలీస్‌ వ్యవస్ధ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్‌ను రూపొందించింది. సామాన్యులెవరైనా ఈ నిఘా యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు. ఇక ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు… అభ్యర్థిపై వెంటనే విచారణ జరిగి నిజమని తేలితే అనర్హత వేటు కూడా వేయడం జరుగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/