అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ ..

అగ్నిపథ్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లడమే కాదు..ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. బీహార్ మొదలైన అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళన రోజు రోజుకు ఉదృతం అవుతుంది. బీహార్ , యుపి , రాజస్థాన్ లతో పాటు ఇప్పుడు తెలంగాణ లో కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీనిని నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

శుక్రవారం ఉదయం నిరసన కారుల ఆందోళన చర్యతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆపై రైల్వే స్టేషన్‌లోకి చొరబడిన వందల సంఖ్యలో యువకులు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. అక్కడితో ఆగకుండా స్టాల్స్‌, రైళ్లను తగులబెట్టారు. నిరసన కారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో.. ఒకరు మృతి చెందారు.

ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారు రేపు (జూన్18)న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు బీజేపీయేతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆర్మీని కూడా ప్రైవేట్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అగ్నిపథ్ పథకాన్ని యువత తిరస్కరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దాదాపు ఎన్డీయేతర పార్టీలన్నీ రేపు జరిగే బంద్ కు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.