వృద్ధాప్యాన్ని గౌరవించాలి

వృద్ధాప్యాన్ని  గౌరవించాలి
Aging should be respected

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు… ఔను మనిషంటే…. స్వార్థంతో కేవలం తన కోసమే ఆలోచిస్తూ , డబ్బు సంపానలో పడి తన వారిని సహితం మరిచిపోతున్న ఈ కాలంలో నిజాయితీ గల మనిషి కనిపించడం లేదు. కేవలం చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకునే వారు మాత్రమే ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. ఇక ప్రధానంగా ఐటి రంగం ప్రవేశించిన తరువాత దేశవిదేశాల్లో స్థిరపడి తనవారందరినీ పూర్తిగా మరిచిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇక్కడివారు అక్కడికి వెళ్లి కొత్త వాతావరణంలో ఉండటం ఇష్టపడటం లేదు.. అక్కడి వారు ఇక్కడికి రావాలంటే సెలవ్ఞలు, ఆర్థిక పరిస్థితులు తదితర కారణాల వల్ల ఒకే కుటుంబంలోని సభ్యులంతా దూరంగా ఉండవలసి వస్తుంది. అయితే ఇటీవల, సెల్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు రావడంతో కొంత దూరం తగ్గినా భౌతికంగా వేలాది మైళ్ల దూరంలో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తాము అనుభవించే బాధ్యలు చెప్పడం ఇష్టం ఉండదు.. ఒక వేళ చెప్పినా పిల్లలు ఎంత బాధపడతారో అని మౌనంగా ఉండిపోతున్నారు.. అంతేకాదు మనిషి సగటు వయో పరిమితి కూడా పెరిగిపోయింది.. దాంతో వృద్ధుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వృద్ధుల కోసం ప్రత్యేక అపార్ట్‌మెంటులు నిర్మిస్తున్నారు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మరణిస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడానికి కొత్త సంస్థలు ఏర్పడ్డాయి.. కానీ ఎంతైనా ఒకప్పుడు భారత దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమైపోతుంది. అనురాగం, ఆప్యాయతలు కూడా అడు గంటిపోతున్నాయి. కొన్ని దేశాలలో 65 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్‌మెంట్‌ హోం పేరిట ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. అక్కడ వారి ఆలనా పాలనా అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. వారి ఇళ్ల సమీపంలో టివిలు, రిక్రియేషన్‌ సెంటర్లు, దుకాణ సము దాయాలు, ఆసుపత్రి వంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదు.. మారుతున్న కాలంతో పాటు వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలు చేసుకోవలసిన అవసరం ఉంది.వయసులో ఉన్నప్పుడు సమయాన్ని, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా కష్టపడినవారు కనీసం వృద్ధాప్యంలో సుఖ పడటానికి కనీస సౌకర్యాలు, సదుపాయాలు కల్పించిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అంతేకాదు వారి అనుభవాలను తెలుసుకుని వారి సలహాలు పాటించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/