వృద్ధాప్యం శాపం కాదు.. అనుభవాల ఆస్తి

ఆదరిద్దాం చేయూత నిద్దాం

Aging- property of experiences
Aging- property of experiences

విశ్వంలో విలువకట్ట లేనిది ఏదైనా ఉన్నదంటే అది ప్రాణం ఒక్కటే.

మనకు జన్మనిచ్చి ప్రాణం పోసిన వారు యుక్త వయస్సులో తమ సుఖాల్ని, సంతో షాల్ని త్యాగం చేసి తమ కన్నబిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని..

పెంచి పెద్ద చేసి జీవితమంతా కుటుంబానికి ధారపోసి అలసిన వృద్ధుల జీవితాలు విశ్రాంతి తీసుకునే వేళ, అనారోగ్యం, ముసలితనంలో నిస్సత్తువ, ఒంటరి తనంలో ఉన్న వారికి భరోసా కల్పించాలి.

వృద్ధులు మాకు వద్దు- ఆస్తిపాస్తులే ముద్దు అంటున్న తీరుతో వృద్ధుల జీవితాలు దయ నీయంగా మారాయి.

నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో సంపదపై ఉన్న ఆశలు, ఆ స్థాయికి తీసుకు వచ్చిన వృద్ధులపైన ప్రేమానురాగాలతో చూడాల్సిన వారి సంతానం, సమాజం బాధ్యత వహించేవాళ్ల చీత్కారాలతో, హేళనతో వృద్ధులు లోనవ్ఞ తున్న దయనీయస్థితి కొనసాగుతుంది.

దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం నూటికి డెబ్భై ఒక మంది పెద్దవాళ్లు ఏదో ఒక రూపంలో సొంత కుటుంబ సభ్యుల, బంధువుల నుంచే వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని తేలింది.

ఆర్థికంగా ఉన్నవారు, పేదవారు, విద్యావంతులు అనే తేడా లేకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నట్లు అంచనాలో తేలింది.

ఈ పరిస్థితులను గమనించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరుగుతున్న వృద్ధుల జనాభాని,వారిపై వేధింపులను అరికట్టుటకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధుల సంరక్షణ చట్టాలు తేవాల్సిందిగా అన్ని దేశాలను కోరింది.

దీని మూలంగా అన్ని దేశాలు వృద్ధుల సంరక్షణ చట్టాలు చేశాయి.

మనదేశంలో కూడా కేంద్రప్రభుత్వం వృద్ధుల సంరక్షణ కోసం ‘మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌యాక్ట్‌ (చట్టం) 2007ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులతోపాటు తాతలు, బామ్మలు, వృద్ధుల ఆస్తులను తను అభవిస్తున్న బంధువులు, వారసులు చట్టపరంగా సంరక్షకులు. ఆఖరికి ప్రభుత్వాలు సామాజిక స్పృహతో వృద్ధుల బాధ్యతను తీసుకోవాల్సి ఉంది.

వారికి చాలినన్ని వృద్ధాశ్రమాలు నెలకొల్పడం, ఆర్థికంగా ఆదుకోవడం కోసం వృద్ధాప్య పింఛను ఇవ్వడం లాంటి మానవీయ బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గమనించాల్సి ఉంది.

ఇందులో భాగంగా మన దేశంలో పెన్షన్లు అమలు జరుగుతున్నాయి. మానసికంగా, భౌతికంగా అనారోగ్యంగా వయోభారంతో తమ పనులు తాము చేసుకోలేని దీన స్థితిలో ఎప్పటికీ ఒక మనిషిపై ఆధారపడే కాలంలో అభద్రతతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

వీరి బాధ్యతలు పంచుకోవాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం చూసి ‘కక్కలేక మింగలేక వెక్కివెక్కి ఏడుస్తూ ఫిర్యాదు చేయలేక బంధాల నడుమ కాలం వెళ్లదీస్తున్నారనేది కాదనలేని నిజం.

తమ పంచప్రాణాలు సంతానం కోసం ధారపోసి తమ విలువైన కాలాన్ని గడిపిన వాళ్లతో అలాంటి ప్రేమపూర్వక పలకరింపులు, ఆత్మీయ స్పర్శతో కాసేపు సమయాన్ని గడపాలని ఆశించడం నేరమా? ఆ అవకాశం ఇవ్వాలి కదా!

ఇది కనీస బాధ్యత కాదా! అని నిలదీయలేని స్థితిని గమనించి మానవీయతనైనా చాటండని కోరుకుంటున్నారు. మనదేశంలో వృద్ధులు జనాభా 2011 నాటికే పదికోట్లపైన ఉంది. 2026 నాటికి అది 17 కోట్లు అవ్ఞతుందని అంచనా వేస్తున్నారు.

ఇన్ని కోట్ల మంది వృద్ధులుంటే దేశం మొత్తం మీద లక్షల మందికి సరిపోయే వృద్ధాశ్రమాలు కూడా లేవు.

మనదేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వృద్ధాశ్రమాలు 726, అందులో 325 మాత్రమే ఉచితం. తెలంగాణలో 104, ఆంధ్రప్రదేశ్‌లో 267 వృద్ధాశ్రమాలు ఉంటే అందులో రెండు మాత్రమే ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్నాయి.

సీనియర్‌సిటిజన్‌ యాక్ట్‌ ప్రకారం కనీసం 150 మందికి ఆశ్రయమిచ్చేలా ప్రతి జిల్లాకీ ఓ వృద్ధాశ్రమం ఉండాలి.

మానవీయ దృక్పథంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహిస్తున్నాయి.

Aging

అంతేకాదు వృద్ధులపై సమాజంలో పాతుకుపోయిన నిర్లక్ష్య ధోర ణుల్లో మార్పుకోసం అవగాహన కార్యాక్రమాలు ఆఫీసుల్లో, కాల నీల్లో, అపార్ట్‌మెంట్‌లలో, కాంప్లెక్స్‌లలో నిర్వహించి వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలు తెలియచేస్తున్నారు.

కొన్ని చోట్ల సీనియర్‌ సిటిజన్స్‌అసోసియేషన్స్‌గా ఏర్పరిచి వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటున్నాయి. తమ కన్న పిల్లల్ని చూసుకు న్నట్లే తమను కన్న వృద్ధ తల్లిదండ్రుల్ని చూడాలని కోరుకోవడాన్ని ఎలా కాదనగలం.

ఎంత తీరిక లేకపోయినా కనీసం రోజులో కాసేపు వారితో గడపాలి.వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారిని తమతో కలుపుకొని భోజనం చేయించాలి.

వారి అనుభవాలను వయస్సును గౌరవిస్తుండాలి. చాదస్తమని తీసివేసినట్లుగా మాట్లాడ రాదు.ఉద్యోగ ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లోనివారు, ఆశ్రమాల్లో వృద్ధులను చేర్చేవారు, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి.

ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టడం గొప్పతనం కాదు. తన నడవడికతోనే తన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. ఇంట్లో కనిష్ట వస్తువైన చీపురు ప్రాధాన్యతను గ్రహించి ఇంట్లో ఓ మూలన చోటిస్తున్నారు.

మరీ మనం వృద్ధులకు ఇంట్లో చోటు లేకుండా చేసి వృద్ధాశ్రమాల్లో వేయడం అమానవీయం కాదా! వృద్ధాప్యం శాపం కాదు? అది అనుభవాల ఆస్తి, జీవిత సారంలో పరిపూర్ణంగా పండిన పళ్లు, పండుటాకులనే నిర్లక్ష్యం వీడండి. ఏదో రోజు అందరం ఆ దశ దాటాల్సిందే. ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తిని మృత్యువ్ఞ కబళిస్తుంది. దాని నుండి బయటపడలేం.

మనిషి తన అహాన్ని, సంపాదనలపై దురాశను వీడి మానవ త్వంతో వృద్ధులను చేరదీస్తూ కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత వారి కుటుంబ సభ్యులది.

పాలకులు సామాజిక బాధ్యతతో వృద్ధులకు అసలు వేధింపుల సమస్యే తలెత్తకుండా మనుషుల్లో సమాజంలో మార్పు తీసుకురావాలి.

గౌరవంగా బతికే హక్కులు వృద్ధులకు ఉన్నాయనే విషయాన్నితెలుసుకుని మసలుకోవాలి. మాతృత్వం ఓ మాధుర్యం.

సంతానం ఓ సౌభాగ్యం అని నమ్మిన వారి నమ్మకాలను వమ్ము చేయకండి. కడవరకు కట్టె కాలే వరకు చేరదీసి చేయూతనిద్దాం. గౌరవిద్దాం.

  • మేకిరి దామోదర్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/