తిరుపతి లో ‘అగ్గిపెట్టె’ హత్య కు దారితీసింది

ఈరోజుల్లో చంపడానికి పెద్దగా కారణం అవసరం లేకుండా పోయింది. వంద రూపాయిల కోసం ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. తాజాగా రూపాయి అగ్గిపెట్టె ఓ వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. ఏంటి నమ్మడం లేదా..? ఇది నిజం..? ఇది ఎక్కడో జరిగింది కూడా కాదు తిరుపతి లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావు భార్యాపిల్లలను వదిలేసి, గత కొంతకాలంగా తిరుపతిలో భిక్షాటన చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 15న మహిళా వర్సిటీ బస్‌షెల్టర్‌లో నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో గుంతకల్లుకు చెందిన పాత నేరస్థుడు ఎ.మణిరత్నం అలియాస్‌ ఆర్ముగం అక్కడికి వచ్చాడు. అతను చిత్తు కాగితాలు ఏరుకుంటూ.. వాటిని అమ్ముకుని జీవిస్తున్నాడు. బీడీ వెలిగించుకునే అగ్గిపెట్టె కోసం లక్ష్మణరావును అడిగాడు.

తాను మంచి నిద్రలో ఉండగా.. లేపినందుకు లక్ష్మణరావు కోపంతో మణిరత్నంను బండబూతులు తిట్టాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న కర్రతో అతడిని కొట్టేందుకు యత్నించాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్లి మణిరత్నం.. లక్ష్మణరావు నిద్రపోయే వరకు చూశాడు. అతను నిద్రపోగానే.. బండరాయి తీసుకువచ్చి తలపై కొట్టి హత్య చేసి అక్కడి నుండి పరారయ్యాడు. గుర్తుతెలియని వృద్ధుడి హత్యగా కేసు నమోదు చేసిన ఎస్వీయూ పోలీసులు.. మృతుడి వద్ద ఆధారాలను సేకరించి , దర్యాప్తు మొదలుపెట్టి నిందితుడిని మణిరత్నంగా గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 24న రైల్వేస్టేషన్‌ వద్ద అరెస్టు చేశారు. మణిరత్నంపై 2017లో మసీదులో హత్య చేసి ఆధారాలు చెరిపేసిన కేసు కూడా నమోదైనట్లు గుర్తించారు.