కెసిఆర్ తర్వాత కెటిఆరే.. కాబోయే సీఎం
పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మనపేట గ్రామంలో రెండో విడత పల్లెప్రగతిని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…కెటిఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాల సమర్థమైన నాయకుడని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని వ్యాఖ్యనించారు. తెలంగాణలో కోతలు లేకుండా చేసి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కెసీఆర్దే అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు రావని, కాంగ్రెస్కు ఘోర పరాజయం తప్పదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇంకా గ్రామాల ప్రగతి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. ఇళ్లతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.
తాజా ఎపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/