వెనక్కి తగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబానికి చెందిన సొంత గోల్ఫ్‌ రిస్టార్‌ లో జీ7 దేశాధినేతల సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్షాలు, మీడియాలో తీవ్ర విమర్శలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వేరే వేదికలతో పోలిస్తే తన కుటుంబానికి చెందిన రిస్టార్ట్‌ లో తక్కువ ఖర్చు అవుతుందని, ఆ విధంగా ప్రభుత్వానికి మేలు చేద్దామని భావించానని ఆయన తెలిపారు. నిబంధనలు అనుమతిస్తే ఎలాంటి రుసుమూ తీసుకోకుండానే సదస్సు నిర్వహిద్దామనుకున్నామన్నారు. కానీ, మీడియా డెమోక్రటిక్‌ పార్టీ నేతల అసంబద్ధమైన విమర్శలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. మరో వేదిక కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు.


వచ్చే ఏడాది జరగనున్న జీ7 గ్రూపు అధినేతల సదస్సును ట్రంప్‌నకు చెందిన సొంత గొల్ఫ్‌ రిసార్ట్‌లో నిర్వహించాలని శ్వేతసౌధం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. వచ్చే ఏడాది జూన్‌ 10 నుంచి 12 వరకు జరగనున్న 46వ జీ7 సదస్సును ఫ్లోరిడాలోని ట్రంప్‌ నేషనల్‌ డోరల్‌ రిసార్ట్‌లో నిర్వహించాలని ఖరారు చేశారు. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఇంతగా దుర్వినియోగం చేసిన వారు ఎవరూ లేరంటూ దీనిపై విమర్శలు వచ్చాయి. 2015 నుంచి ఈ రిసార్ట్‌ ఆదాయం పడిపోతుండడంతో దానిని పెంచుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్వేత సౌధం వివరణ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలను పరిశీలించగా, వాటిన్నింటి కన్నా సగం ఖర్చులో ట్రంప్‌ రిసార్ట్‌ మాత్రమే లభించిందని తెలిపింది. అయినా విమర్శలు ఆగకపోవడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ట్రంప్‌ ప్రకటించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/