ఐక్యరాజ్యసమితికి ప్రతిఘటన దళం లేఖ

తాలిబన్ల దుశ్చర్యలను ఆపాలంటూ లేఖ

కాబుల్ : ఇన్నాళ్లూ తమకు కొరకరాని కొయ్యగా తయారైన పంజ్ షీర్ నూ ఇప్పుడు తాలిబన్లు దాదాపు ఆక్రమించేశారు. అయితే, ఆఫ్ఘన్ ప్రతిఘటన దళం దెబ్బకు ఎంతో మందిని కోల్పోయిన తాలిబన్లు ఇప్పుడు ఆ కోపాన్నంతా ప్రావిన్స్ లోని మామూలు ప్రజలపై చూపిస్తున్నారట. కనిపించినవాళ్లను కనిపించినట్టే ఊచకోత కోస్తున్నారట.

ఇప్పుడు ప్రతిఘటన దళం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఊచకోతలను ఆపించాలంటూ ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలను కోరుతూ లేఖ రాసింది. పంజ్ షీర్ ప్రావిన్స్ లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు చేస్తున్నారని, ఊచకోత కోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ప్రతిఘటన దళాన్ని ఎదుర్కొని చావుదెబ్బ తిన్న తాలిబన్లు.. ఆ పగనంతా ప్రజలపై తీర్చుకుంటున్నారని పేర్కొంది. వారి ఆగడాలకు సరిహద్దుల్లో పడి ఉన్న ప్రజల మృతదేహాలే నిదర్శనమని తెలిపింది. వెంటనే ఊచకోతలను ఆపాల్సిందిగా తాలిబన్లకు చెప్పాలంటూ ఐరాసను లేఖలో కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/