తాలిబన్లను కాల్చి చంపిన బాలిక

కళ్లెదుటే తన తల్లిదండ్రులను చంపడంతో ప్రతీకారంగా హత్య

Afghan girl kills two Taliban militants

ఘజ్ని: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 14 ఏండ్ల బాలిక కమర్‌గుల్‌ తాలిబన్‌ కు చెందిన ఇద్దరు ముష్కరులను కాల్చి చంపింది. ఘోర్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాలిక తండ్రి ఆ గ్రామపెద్ద. ఆయన ప్రభుత్వానికి మద్దతుదారు. దీంతో తాలిబన్లు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనను బయటకు లాక్కొచ్చారు. ఆయన భార్య అడ్డుపడడంతో ఇద్దరినీ ఇంటి బయట కాల్చిచంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ఆ బాలిక.. ఇంట్లో ఉన్న ఏకే 47 తుపాకీతో ఆ ఇద్దరు తాలిబన్లను కాల్చిచంపింది. వారికి సహకరించిన మరికొందరిని కూడా గాయపరిచింది. ఘటన అనంతరం మరికొందరు తాలిబన్లు ఆమెపై దాడి చేసేందుకు రాగా, ప్రభుత్వ మిలీషియా సభ్యులు, పలువురు గ్రామస్థులు వారిని మట్టుబెట్టారు. బాలికను, ఆమె సోదరుడిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ బాలిక ప్రదర్శించిన ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/