రేపు IPL మ్యాచ్ సందర్బంగా ఉప్పల్ కు అదనపు మెట్రో రైళ్లు

IPL సీజన్ 16 శుక్రవారం మొదలైన సంగతి తెలిసిందే. రేపు (ఏప్రిల్ 02) మధ్యాహ్నం 3.30గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అభిమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెట్రో..ఉప్పల్ కు అదనపు మెట్రో సర్వీస్ లను నడపనున్నట్లుగా మెట్రో ప్రకటించింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే నగర శివార్ల నుంచి ఉప్పల్ కు స్పెషల్ బస్సులను నడపనున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది.

ఇక ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వ‌ర‌కు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్ప‌ల్ స్టేడియం లో జరగనున్నాయి. ఈ క్రమంలో రాచ‌కొండ పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. శ‌నివారం ఉద‌యం స్టేడియంను రాచ‌కొండ పోలీసు క‌మిష‌న్ డీఎస్ చౌహాన్‌ ప‌రిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేప‌థ్యంలో 1500 మంది పోలీసుల‌తో బందోబ‌స్తు క‌ల్పిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. స్టేడియం లోప‌ల, వెలుప‌ల మొత్తం 340 సీపీ కెమెరాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు వ‌చ్చే యువ‌తులు, మ‌హిళ‌లు ఈవ్ టీజింగ్‌కు గురి కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీపీ తెలిపారు. షీ టీమ్స్ కూడా నిఘా పెట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంట‌ల కంటే ముందు స్టేడియంను తెరుస్తామ‌ని తెలిపారు. నైట్ మ్యాచ్‌లు జ‌రిగిన‌ప్పుడు సాయంత్రం 4:30 గంట‌ల‌కు స్టేడియం తెర‌వ‌నున్నారు.

ఇక స్టేడియం లో ల్యాప్‌టాప్స్, వాట‌ర్ బాటిల్స్, కెమెరాలు, సిగ‌రెట్లు, ఎల‌క్ట్రానిక్ ఐటెమ్స్, మ్యాచ్ బాక్స్, లైట‌ర్స్, ప‌దునైన ఆయుధాలు, ప్లాస్టిక్ వ‌స్తువులు, బైనాక్యూల‌ర్స్, పెన్నులు, బ్యాట‌రీలు, హెల్మెట్స్, ప‌ర్‌ఫ్యూమ్స్‌, బ్యాగ్స్, తినుబండారాల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.